ముందుమాట
తెలుగు ప్రశ్నపత్రములలో అపరిచిత గద్యాంశమును ఇచ్చి దాని కింద ప్రశ్నలు అడిగి, సమాధానం రాయమనే విధానం అటు సీ.బీ.ఎస్.ఈ లోనూ, ఇటు స్టేట్ పరీక్షలలోనూ ఉన్న విషయం సుపరిచితమే. దీనిని మనం స్థూల అవగాహన అంటున్నాం. విద్యార్థులలో అవగాహనా సామర్ధ్యాన్ని పరీక్షించడానికి స్థూల అవగాహన ఒక బలమైన అంశం . అయితే విద్యార్థులు పుస్తక పఠనంలో అనేక మెళకువలను పాటించాలి. ప్రధానంగా చదివే విషయం మీద దృష్టి ఉంచాలి. చదివే పేరాలో ఏ అంశం గురించి ప్రస్తావిస్తున్నారో గమనించాలి. అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలను క్రమ పద్ధతిలో గుర్తుంచుకోవాలి. అలా చేసినప్పుడు మనకు విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. అవగాహన లేకుండా ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం శూన్యం. కాబట్టి విద్యార్థులలో అవగాహనా సామర్ధ్యాలను పరీక్షించడానికి విషయ ప్రాధాన్యతను బట్టి పేరాలను ఎంపిక చేసుకొని వారిచేత చదివించాలి.ఆ తర్వాత దానిని వారెంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం కోసం చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి.
అపరిచిత గద్యాంశమును ప్రశ్నగా అడిగే విధానం చిన్న తరగతుల నుండి పోటీపరీక్షల వరకు ఉందనడంలో అనుమానం ఎవరికీ ఉండదు. నిజానికి అపరిచిత గద్యాంశం ఇవ్వడం ఒక కళ. అయితే గత పది సంవత్సరాలుగా నేను పరిశీలించిన అనేక పాఠశాలల గద్యాలు నాలో ఏదో అసంతృప్తిని కలిగించాయి. ఒకచో అంశం ఫరవాలేదు అనిపించినా, దాని క్రింద ప్రశ్నల తయారీ మాత్రం ఏమంత హాయిని ఇవ్వలేదు. అందుకే నేను ఈ పనికి శ్రీకారం చుట్టాను. నా దృష్టిలో అపరిచిత గద్యాంశం అంటే దాని ప్రారంభవాక్యమే చదువరిని లాగి బుట్టలో వేసుకోవాలి. దీనికి విషయంలో ఆకర్షణతో పాటు, చదువరికి రసజ్ఞత అవసరం. ఇన్విజిలేషన్ చేస్తున్న తెలుగు చెప్పని ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు సైతం ప్రశ్న పత్రం చేతిలోకి తీసుకుని పూర్తిగా చదివి తృప్తితో నిట్టూర్చాలి. ఇచ్చిన ఉపాధ్యాయ మిత్రుడిని పలకరించాలి, ప్రశంసించాలి. అందులో ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం బహిర్గతం కావాలి. మొత్తానికి గద్యాంశం ప్రశ్నపత్రానికి ప్రాణమై వెలగాలి. అంతేనా? విద్యార్థి ఇంటికి వెళ్లేలోపు ఇంట్లో వారితో సహా ప్రశ్న పత్రం చూసిన ప్రతి ఒక్కరి నోళ్ళల్లో అది చిందులు వేయాలి. అదీ నిజంగా గొప్ప అపరిచిత అంశం అంటే. విద్యార్థి నైతిక, విజ్ఞాన వికాసంలో వీటి పాత్ర చాలా గొప్పది కనుక వీటి విషయంలో శ్రద్ధ తప్పనిసరి.
అందుకే మీ చేతులకు వీటిని ఇలా అలంకరిస్తున్నాను..
ఈ పుస్తకంలోని అపరిచితాల సంఖ్య 64. ఇందులో కొన్ని నా ఆలోచనల నుండి పుట్టినవైతే, మరికొన్ని ఇదివరకే రచయితలో, కవులో తమ పుస్తకాలలో రాయగా అవి సులభంచేసి పొందుపరచినవి. వారి పుస్తకాలు చదువుతున్నపుడు మంచి విషయం అని నాకు అనిపించినభాగాలు ఇందులో ఉంచడం జరిగినది. ఇలా ఎంపిక చేసుకోవడం చాలా కష్టమనీ, అందుకు పరిశీలన ఎంతో అవసరం అని అనుభవంలోకి వచ్చింది. మరికొన్ని అనేక పుస్తకాలు, వారపత్రికలు, ఆదివారం ప్రత్యేకతలు మొదలైన వాటి నుండి స్వీకరించి విషయానుకూలంగా కుదించి ఇచ్చినవి. ఇలా అనేకం…. సందర్భాన్ని బట్టి పుస్తకం, దాని రచయిత పేరును కూడా గద్యాంశం క్రింద ఇవ్వడం జరిగింది. గ్రహించగలరు. మొదటి ఐదు అపరిచితాలకు మాత్రం బహుళైఛ్చిక ప్రశ్నలతో పాటుగా వాటి సమాధానాలు ( ఎం. సి. క్యూ) కూడా అందిస్తున్నాను. తర్వాత కేవలం ప్రశ్నలు మాత్రమే ఉనాటాయి. వాటికి అనుకూలంగా బహుళైఛ్చిక ప్రశ్నలు (ఎం.సీ.క్యూ.లు) మీరు తయారు చేసుకోవలసి ఉంటుంది.
సమాధానాలలో ఒకటి సరైనది ఇచ్చి, మిగిలిన మూడు సమాధానాల పదాలను అర్థరహితంగా, విరిచి , భాష కాని విధంగా ఇవ్వడం అనేకులు తయారు చేయగా నేను గమనించాను. ఇది నిందించడం కాదు సహజంగా జరుగుతున్నది మీకు చేరవేయడం మాత్రమే. కానీ బహుళైఛ్చిక ప్రశ్నల సమాధానాలలో ఒకటి సరైన జవాబు ఉండి మిగిలినవి ఎలాగైనా ఇవ్వవచ్చు అనే భావన తప్పు. అన్నీ అర్థవంతంగా , వ్యాకరణ సహితంగా ఉండాలి. అప్పుడే విద్యార్థికి పద సంపద పక్కదారి పట్టకుండా లాభిస్తుంది. ఈ పుస్తకంలోని గద్యాంశాలను పరిశీలించి, చిన్న పొరపాట్లు ఏవైనా ఉంటే సూచించి, ఆదరిస్తారని కోరుకుంటూ.. అనేకమంది ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ పనికి నన్ను ప్రోత్సహించి, దీని ఉపయోగపరిధిని పెంచిన శ్రీమతి సుషుమ్న రావు తాడినాడ గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే అడిగినదే తడవుగా పుస్తకం పై తమ అమూల్యమైన అభిప్రాయాలు రాసి ఇచ్చిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
About this Openbook
ఈ సంవత్సరం 2024 ఓపెన్ ఎడ్యుకెషన్ వీక్ లో భాగంగా , పై పుస్తకంలోని 25 గద్యాంశాలను ఓపెన్ లైసెన్స్ తో 2024 మార్చి మొదటి వారంలో ఇక్కడ అందిస్తున్నాము.