అపరిచిత గద్యాలు

29 అపరిచిత గద్యం-23

తెలంగాణ రాష్ట్రంలో వనజీవి రామయ్య వలె కర్ణాటకలో పేరు ప్రఖ్యాతులు పొందిన పర్యావరణవేత్త సాలు మరద తిమ్మక్క. ఈమె హులికుల్ నుండి , కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయస్థాయిలో ప్రసిద్ధి చెందారు. తిమ్మక్క బెంగుళూరు రూరల్ జిల్లా అయిన రామనగర్ లోని హులికుల్ గ్రామానికి చెందినది. “సాలుమరద” అంటే కన్నడ భాషలో వృక్షాల వరుస అని అర్థం. తిమ్మక్క భర్త పేరు చిక్కయ్య. భార్య నాటే చెట్లకు నీళ్లు పోసి పెంచడం కోసం ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఉమేష్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. సమాజానికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టేనని నమ్మి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఆ మొక్కలను సొంత బిడ్డల్లా ప్రేమించి, జాగ్రత్తగా పెంచి కాపాడారు. “చెట్లే కదా నా పిల్లలు” అని చెబుతుంటారు తిమ్మక్క.అమెరికాలోని లాస్ ఎంజిల్స్, ఓక్లాండ్, కాలిఫోర్నియాలలో స్థాపించిన పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద “తిమ్మక్క రిసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్” అని పేరు పెట్టారంటే ఈవిడ గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. చదువు లేకపోయినా వేలిముద్ర వేస్తారు. ఏదైనా సేవ చేయాలంటే చదువు అవసరం లేదు, చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అని చెప్తుంటారు తిమ్మక్క. పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో సాలుమరద తిమ్మక్కను గౌరవించింది. మంచి గుణాలు ఉన్న వారిగా, సంస్కారవంతులుగా, సమాజ సేవకులుగా తయారు కావడం అనేది పుస్తకాలలో ఉండే చదువు కాదనీ, మంచి మనసు , ఆలోచన ఉంటే పదిమందికి ఉపయోగపడే పని చేయవచ్చని సాలు మరద తిమ్మక్క జీవితం మనకు నేర్పుతుంది. ఈ విషయం, చదువుకునే విద్యార్థులే కాక, పెద్దలు కూడా గమనిస్తే మార్పు సులభం.

ప్రశ్నలు:

1. సాలు మరద అంటే కన్నడ భాషలో వున్న అర్ధం ?

2. తిమ్మక్క జాతీయ రహదారి పక్కన నాటిన చెట్లు.

3. ఉద్యోగాన్ని వదిలి చెట్లను పెంచింది ఎవరు?

4. తిమ్మక్క దంపతులు పెంచుకున్న అబ్బాయి ?

5. అమెరికా వారు తమ పర్యావరణ సంస్థలకు పెట్టిన పేరు?

Share This Book