అపరిచిత గద్యాలు

14 అపరిచిత గద్యం-8

నెదర్లాండ్స్ చాలా చిన్న దేశం. అక్కడ లోతుగా ఉన్న ప్రాంతాలే ఎక్కువ. బురద నేలలు అధికంగా ఉన్న ప్రాంతం .అక్కడ వ్యవసాయం చేయడమే గొప్ప. పెద్ద పెద్ద గాలి పంకాలతో బురద నేలల్ని ఆరబెట్టుకుంటూ ఎంతో శ్రమతో వ్యవసాయం చేస్తారు. అయినా ఆ దేశం పంటలను తమ కోసమని సరిపెట్టుకోలేదు. పండుతున్న పంటలో చాలా భాగం ఎగుమతి చేస్తుంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, కెనడా, ఆఫ్రికా తదితర దేశాలకు టొమాటో, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లాంటి కూరగాయలనే కాక, అలంకరణకు వాడే పువ్వులు, మొక్కలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసము ఎగుమతి చేసి ఏటా లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. దాంతో ఎప్పుడూ వర్షాకాలంలా ఉండే ఈ చిన్న దేశం ఉన్నట్టుండి ” సిలికాన్ వ్యాలీ ఆఫ్ అగ్రికల్చర్” లాగా తయారయింది. దేశాలన్నీ తమ అవసరాల కోసం పని చేస్తుంటే నెదర్లాండ్స్ మాత్రం కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయడం మొదలుపెట్టింది. రెండు వేల యాభై సంవత్సరం నాటికి పెరిగే ప్రపంచ జనాభా ఆకలి తీరాలంటే ఇప్పటికన్నా ఇంకో యాభై ఆరు శాతం ఎక్కువ ఆహార పదార్థాలు కావాలి. అలాగని సాగుకి అందుబాటులో ఉన్న నేల పెరగదు. మరి దిగుబడి పెంచడం ఎలా? ఈ ప్రశ్నలను నెదర్లాండ్స్ వందేళ్ళ క్రితమే వేసుకుంది. రెండు ప్రపంచ యుద్ధాలు ఆదేశాన్ని అతలాకుతలం చేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన కరువు వల్ల దాదాపు ఇరవై రెండు వేల మంది చనిపోయారు . మరోసారి అలాంటి కరువు రాకూడదని, ఆహార ఉత్పత్తిలో మిగులు సాధించాలని సంకల్పం చేసుకొని ఆ దేశం లక్ష్యసాధన దిశగా చేసిన కృషి ఇప్పుడు దాన్ని ప్రపంచ పటంలో సమున్నతంగా నిలబెట్టింది. ఈ అద్భుత మార్పు కోసం రైతులు, ప్రభుత్వము, వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిశోధకులు కలిసికట్టుగా కృషి చేశారు. ఈ మూడు విభాగాలను కలిపి అక్కడ “గోల్డెన్ ట్రయాంగిల్ “అని పిలుచుకుంటారు.

1. నెదర్లాండ్ లో వున్న భూములు ఏ రకానివి?

2. వర్షాలతో ఉండే భూమి కొద్ది రోజుల్లో ఎలా మారిపోయింది !

3. “గోల్డెన్ ట్రయాంగిల్” అంటే ఎవరు?

4. కరువు వల్ల చనిపోయింది ఎంత మంది?

5. పెరిగే జనాభాకు ఎంత శాతం ఆహారం అవసరం.

Share This Book