అపరిచిత గద్యాలు

13 అపరిచిత గద్యం-7

వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించిన వాళ్లు ఆ సంపాదన మొత్తం వారసులకు పంచుతారు. తాము విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తారు. శ్రీరామ్ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరైన త్యాగరాజన్ మాత్రం తాను సంపాదించిన దాదాపు ఆరు వేల రెండువందల కోట్ల సంపదను వారసులకు కాకుండా ఉద్యోగులకు పంచేశారు. ఆడంబరాలకు దూరంగా ఓ చిన్న గదిలో జీవిస్తున్న ఆ పెద్దమనిషి వ్యాపారవేత్తనని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. నూటికో, కోటికో ఒక్కరుగా ఉండే ఇటువంటి వ్యక్తుల జీవితం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. త్యాగరాజన్ తమిళనాడులోని వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. పేదరికం వల్ల ఆయన కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. పస్తులతో గడిపిన రోజులు, నిద్రలేని రాత్రులు త్యాగరాజన్ కు ఇంకా గుర్తే ఉంటుంది. పట్టుదలతో బాగా చదువుకున్న ఆయన మద్రాసులో డిగ్రీ చేశారు. తండ్రికి ఇష్టం లేకపోయినా కోల్కత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ యూనివర్సిటీలో నెలకు నూటా ఇరవై అయిదు రూపాయల స్టయిఫండ్ ఇస్తారని అక్కడికి వెళ్లి పీజీలో చేరారు. 1961లో చదువు అయిపోయాక ఒక బీమా సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన త్యాగరాజన్ ఇరవై ఏళ్ల పాటు అక్కడే పని చేశారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి లోన్లు పొందలేక ఇబ్బంది పడే పేదవారి బాధను ప్రత్యక్షంగా చూసిన ఆయన కమర్షియల్ ఫైనాన్స్ వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. అందుకే 2006 లో ఉద్యోగులే భాగ స్వాములు, యజమానులు గా ఉండే ఒక ట్రస్ట్ ను స్థాపించారు. సంస్థ నుంచి ఆ ట్రస్ట్ కు కొంత డబ్బును అందిస్తూ, పదవీ విరమణ సమయంలో వారికి అదనంగా డబ్బులు అందజేస్తుంటారు. అంతేకాకుండా త్యాగరాజన్ తన ఆరోగ్య అవసరాల కోసం ఓ నలభై లక్షల రూపాయలు ఉంచుకొని మిగతా ఆరువేల రెండు వందల కోట్ల రూపాయలని ఆ ట్రస్ట్ కి బదిలీ చేశారు. ఉద్యోగుల బాగోగుల గురించి ఆలోచించిన ఆ పెద్దమనిషి “హోదా అనేది సొంతంగా తెచ్చుకోవాలి కానీ వారసత్వంగా రాకూడదు” అని నమ్ముతారు. అందుకే తన పిల్లలకు శ్రీరామ్ గ్రూప్ యాజమాన్య బాధ్యతలను ఇవ్వలేదు. ఆయన పెద్ద కొడుకు ఇంజనీరుగా పనిచేస్తుంటే ,చిన్న కొడుకు సి.ఏ.గా ఆ సంస్థలోనే సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఫోనును టైం వేస్ట్ గా భావించే ఆయన సమయం దొరికితే పుస్తకాలు చదువుతారు. శాస్త్రీయ సంగీతం వింటారు. ఈ మహా మనిషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

1. త్యాగరాజన్ ఏ కుటుంబం లో పుట్టి పెరిగారు?

2. డబ్బున్న వారు తమ సంపాదన సహజంగా ఎవరికి పంచుతారు?

3. సమయం దొరికితే త్యాగరాజన్ చేసే పని ఏమిటి?

4. సి.ఏ. గా పని చేస్తున్నది ఎవరు?

5. త్యాగరాజన్ కు భారత ప్రభుత్వం ఇచ్చినది ?

Share This Book