అపరిచిత గద్యాలు

21 అపరిచిత గద్యం-15

రొట్టెలు కాల్చుకోవడానికి నూనె కూడా లేనంత పేదరికంతో,గుడిసెలో, గుడ్డి దీపపు వెలుగులో చదువుకుని దేశ ప్రథమ పౌరుడి స్థానానికి ఎదిగిన మహనీయుడు డాక్టర్ ఏ.పీ.జే అబ్దుల్ కలాం. వారు మన దేశానికి 11 వ రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా ఎనలేని సేవలందించి చరితార్ధుడయ్యారు. తమిళనాడులోని రామేశ్వరం లో పుట్టి పెరిగిన కలాం తన జీవిత విశేషాలను తెలుపుతూ ఇలా అన్నారు.నాకు అన్ని రకాల పుస్తకాలు చదవడం ఇష్టమైనప్పటికీ చాలా బాగా నచ్చిన పుస్తకాలు మూడు ఉన్నాయి .అందులో మొదటిది “లిల్లియన్ ఇష్టర్ వాట్సన్” సంకలనం చేసిన “లైట్ ఫ్రమ్ మెనీ లాంప్స్” ఈ పుస్తకం నేను 1953లో చెన్నైలో మూర్ మార్కెట్లో, పాత పుస్తకాల దుకాణంలో కొన్నాను.అప్పటి నుండి గత ఐదు శాబ్దాలుగా ఆ పుస్తకం నా ఆత్మీయ మిత్రుడిగా, సహచరుడుగా ఉంటూ వచ్చింది. నేను ఎంతో గౌరవించే మరొక పుస్తకం “తిరువళ్లు వర్” రచన తిరుక్కురల్. ప్రతి ఒక్కరికి చక్కని నడవడికను సూచించే రచన అది. ఇక మూడవ పుస్తకం నోబెల్ బహుమతి గ్రహీత అయిన డాక్టర్ “అలక్సీ కారేల్” రచించిన “మాన్ ద అన్నోన్”. మనం పిల్లలకి, విద్యార్థులకి తప్పనిసరిగా చెప్పవలసిన మాట ఒకటి ఉంది.అది రోజు కనీసం ఒక గంట సేపైనా పుస్తకాలు చదవండని చెప్పడం అంటారు కలాం. చదివిన వారు ఒక విజ్ఞాన నిధిగా మారిపోతారు అంటారు. మనం ఎవరికైనా కానుకలు ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా పిల్లలకు కానుకలు ఇచ్చేటప్పుడు పుస్తకాలు బహూకరించడం అలవాటు చేసుకోవాలి అని చెప్పి, చేసిన వారు అబ్దుల్ కలాం. “నా ఈ ఎదుగుదలకు మా అమ్మగారే కారణం ” అంటూ తాను రాసిన “వింగ్స్ ఆఫ్ ఫైర్” పుస్తకంలో మాతృమూర్తికి కృతజ్ఞతలు తెలుపుకున్న మహనీయుడు కలాం.

ప్రశ్నలు:

1. అలెక్సి కారెల్ అందుకున్న బహుమానం ఏది?

2. మూర్ మార్కెట్లో కలాం కొన్న పుస్తకం పేరు?

3. తిరువళ్ళువర్ రచించిన రచన ఏది?

4. మనం కానుకలుగా వేటిని ఇవ్వడం అలవాటు చేసుకోవాలి.

5. ” వింగ్స్ ఆఫ్ ఫైర్ ” రచయిత ఎవరు?

Share This Book