ఎందుకు? నేనివి మీ ముందుకు తెచ్చాను?
తెలుగు ప్రశ్నపత్రములలో అపరిచిత గద్యాంశమును ఇచ్చి దాని కింద ప్రశ్నలు అడిగి, సమాధానం రాయమనే విధానం అటు సీ.బీ.ఎస్.ఈ లోనూ, ఇటు స్టేట్ పరీక్షలలోనూ ఉన్న విషయం సుపరిచితమే. దీనిని మనం స్థూల అవగాహన అని అంటున్నాం. విద్యార్థులలో అవగాహనా సామర్ధ్యాన్ని పరీక్షించడానికి స్థూల అవగాహన ఒక బలమైన అంశం.
అయితే, విద్యార్థులకు పుస్తక పఠనంలో మెళకువలు తెలిస్తేనే విషయం పై అవగాహన వస్తుంది. ఆ దిశగా వారికి ఈ మెళకువలను తెలియజేయాలి. అవగాహనా సామర్ధ్యం పెంపొందించుకోవాలంటే ప్రధానంగా చదివే విషయం మీద దృష్టి ఉండాలి.
చదివే పేరాలో ఏ అంశం గురించి ప్రస్తావిస్తున్నారో గమనించఆలి. అందులో ప్రస్తావనకు వచ్చే అంశాలను క్రమ పద్ధతిలో గుర్తుంచుకోవాలి. ఇలా చేసినప్పుడు చదివేవారికి అందులో ఇచ్చిన విషయం మీద సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.
అవగాహన లేకుండా ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎన్ని గంటలు చదివినా ప్రయోజనం శూన్యం. కాబట్టి విద్యార్థులలో అవగాహనా సామర్ధ్యాలను పరీక్షించడానికి విషయ ప్రాధాన్యతను బట్టి పేరాలను ఎంపిక చేసుకొని వారిచేత చదివించాలి. ఆ తర్వాత దానిని వారెంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడం కోసం చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి.
అపరిచిత గద్యాంశము ఇచ్చి ప్రశ్నలు అడిగే విధానం చిన్న తరగతుల నుండి పోటీపరీక్షల వరకు ఉంది. నిజానికి అపరిచిత గద్యాంశం ఇవ్వడం ఒక కళ. అయితే గత పది సంవత్సరాలుగా నేను పరిశీలించిన అనేక పాఠశాలల గద్యాలు నాలో ఏదో అసంతృప్తిని కలిగించాయి. ఒకచో అంశం ఫరవాలేదు అనిపించినా, దాని క్రింద ప్రశ్నల తయారీ మాత్రం ఏమంత హాయిని ఇవ్వలేదు, సరికదా నిజంగా అవి విద్యార్థుల అవగాహనా సామర్థ్యాన్ని పెంపొందించేవిగా, వారి స్థూల అవగాహన శక్తిని పరీక్షించేవిగా ఉన్నాయా? అనిపించింది.
అందుకే నేను ఈ పనికి శ్రీకారం చుట్టాను. నా దృష్టిలో అపరిచిత గద్యాంశం అంటే దాని ప్రారంభవాక్యమే చదువరిని లాగి బుట్టలో వేసుకోవాలి. దీనికి విషయంలో ఆకర్షణతో పాటు, చదువరికి రసజ్ఞత అవసరం. ఇన్విజిలేషన్ చేస్తున్న తెలుగు చెప్పని ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు సైతం ప్రశ్న పత్రం చేతిలోకి తీసుకుని పూర్తిగా చదివి తృప్తితో నిట్టూర్చాలి. ఇచ్చిన ఉపాధ్యాయ మిత్రుడిని పలకరించాలి, ప్రశంసించాలి అనిపించాలి. అందులో ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం బహిర్గతం కావాలి. మొత్తానికి గద్యాంశం ప్రశ్నపత్రానికి ప్రాణమై వెలగాలి. అంతేనా? విద్యార్థి ఇంటికి వెళ్లేలోపు ఇంట్లో వారితో సహా ప్రశ్న పత్రం చూసిన ప్రతి ఒక్కరి నోళ్ళల్లో అది చిందులు వేయాలి. అదీ నిజంగా గొప్ప అపరిచిత అంశం అంటే. విద్యార్థి నైతిక, విజ్ఞాన వికాసంలో వీటి పాత్ర చాలా గొప్పది కనుక వీటి విషయంలో శ్రద్ధ తప్పనిసరి.
విద్యార్థుల జ్ఞానపరిధిని దృష్టిలో ఉంచుకొని శ్రద్ధతో, ఇష్టపడి గద్యాంశం తయారుచేయాలి. వారి భాషా నైపుణ్యాలను పెంచడంలో కీలకపాత్ర పోషించే అపరిచిత గద్యం తయారీ విద్యార్థుల పఠనం, గ్రహణం మరియు విశ్లేషణ సామర్ధ్యాలను పెంపొందించేదిగా ఉండాలి. అలాగే గద్యాంశం వారికి భాషపై పటుత్వం పెంచేదిగా, వారి ఆలోచనా శైలిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి.
గద్యాంశం విషయం, మరీ ప్రత్యేకమైనదిగా కేవలం ఆ విషయం తెలిసినవారికే అర్థం అయ్యేలా ఆయా నిపుణత గల లేదా ఆవిషయ పరిజ్ఞానం ఉన్నవారికే అర్థం అయ్యేలా కాకుండా ప్రతీ ఒక్కరికీ అర్థం అయ్యే రీతిలో సులభంగా అర్థం అయ్యే పదజాలంతో చదువరికి ఆసక్తి రేకెత్తించేలా ఉండాలి.