అపరిచిత గద్యాలు
15 అపరిచిత గద్యం-9
గ్రామానికి మేలు చేయాలంటే చేతిలో అధికారం ఉండక్కర్లేదని, మంచి ఆలోచన ఉంటే చాలని నిరూపించారు రామ్ హర్. హర్యానాలో ఏమాత్రం అభివృద్ధి చెందని గ్రామాల్లో సిలానీ కేశో ఒకటి. కరెంటు లేక ఆ గ్రామం చాలా కాలం చీకట్లో ఉండిపోయింది. భారత సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యాక తాను పుట్టి పెరిగిన కేశో లోనే స్థిరపడ్డాడు రామ్ హర్. విద్యుత్తు సౌకర్యం కల్పించమంటూ అధికారులు చుట్టూ తిరిగాడు. తర్వాత గ్రామస్తులతో కలిసి ఎన్ని అభ్యర్థనలు సమర్పించినా ఎలాంటి స్పందన రాలేదు. దాదాపు అయిదు సంవత్సరాలు అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో రామ్ హర్ స్వయంగా రంగంలోకి దిగాడు. కోడి రెట్ట నుంచి కరెంటు తయారు చేయొచ్చని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. కోళ్ల వల్ల మాంసం, గుడ్డుతో పాటు ఈ ప్రయోజనం కూడా అదనంగా ఉండడంతో 20వేల కోళ్ళతో పౌల్ట్రీని ప్రారంభించాడు. కోళ్ల రెట్టలను సేకరించి ఒక ట్యాంకు లో నిల్వచేసి అందులోంచి వచ్చే మీథేన్ గ్యాస్ తో జనరేటర్ ను నడుపుతున్నాడు. దాంతో మొదట తన పౌల్ట్రీ ఫామ్ కి , ఇంటికి కరెంటు కనెక్షన్ ఇచ్చాడు. క్రమంగా కోళ్ల సంఖ్యను పెంచడంతోపాటు విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేసి గ్రామస్తులు ఇళ్లకు వెలుగులు పంచడం మొదలుపెట్టాడు. తమ గురించి పెద్ద మనసుతో ఆలోచించిన రామ్ హర్ కు గ్రామస్తులు తోడుగా నిలబడ్డారు. విద్యుత్తు తయారీకి అయ్యే ఖర్చును తాము కూడా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతినెలా కరెంటు బిల్లు రూపంలో కొంత డబ్బును రామ్ హర్ కు చెల్లిస్తుంటారు. కోడి రెట్టలతో కరెంటును తయారు చేయడం వల్ల ఆ ప్రాంతంలోని రైతులు తమ పౌల్ట్రీ లోని రెట్టల్ని సేకరించి అమ్మి అదనపు ఆదాయమూ పొందుతున్నారు. దాంతో పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయి అంటున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం రామ్ హర్ కొడుకులు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఇరుగుపొరుగు గ్రామాల్లోని కోడి రెట్టల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి స్థానికులకు వెలుగులు పంచే పనిలో పడ్డారు.
ప్రశ్నలు:
1. తన గ్రామానికి కరెంటు కోసం రామ్ హర్ ఎన్ని రోజులు ప్రయత్నించాడు.
2. కోడి రెట్ట నుండి కరెంటు తయారు తీయవచ్చని రామ్ హర్ కు చెప్పింది ఎవరు?
3. కోడి రెట్టలు నింపిన ట్యాంకు నుండి వచ్చే గ్యాస్ పేరు ఏమిటి?
4. రామ్ హర్ బాటలో నడుస్తున్నది ఎవరు?
5. పౌల్ట్రీ ఎన్ని కోళ్లతో ప్రారంభమైంది?