అపరిచిత గద్యాలు

12 అపరిచిత గద్యం-6

జీవితాన్ని ఉద్యమమయంగా, ఆలోచనను చైతన్యవంతముగా మలుచుకుని సమాజంలో స్ఫూర్తి నింపేందుకు అహర్నిశలు తపించిపోయిన తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి. ఈయన నల్లగొండ జిల్లా, నకిరేకల్ దగ్గరలోని, మాధవరం గ్రామంలో 1915 నవంబర్ 1న జన్మించాడు. తల్లిదండ్రులు సింహాద్రమ్మ , రామచంద్రాచార్యులు. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన ఆళ్వారు స్వామి తెలిసిన వాళ్ళ ఇండ్లలో వండి పెడుతూ ,ఇంటి పనులు చేస్తూ, విద్యాభ్యాసం చేశాడు. బెజవాడ హోటల్లో సర్వర్ గా గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా పనిచేస్తూనే సాహిత్య అభిరుచిని, లోకజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ఆళ్వారు స్వామి గ్రంథాలయ ఉద్యమం ,ఆంధ్రోద్యమం, ఆంధ్ర మహాసభ, అరసం గుమస్తాల సంఘం, రైల్వే కార్మిక సంఘాలు మొదలైన సాహిత్య ,రాజకీయ ,ప్రజా ఉద్యమాల సంఘాలలో చురుగ్గా పాల్గొనేవాడు.కాళోజీ, వానమామలై వరదాచార్యులు, పద్య దాశరథి, గద్య దాశరథి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల, రావి నారాయణరెడ్డి మొదలైన తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తెలంగాణ ప్రజలలో చైతన్యం పెంపొందించడానికి “దేశోద్ధారక గ్రంథమాల”ను స్థాపించి 33 పుస్తకాలను ప్రచురించారు. అనేక రకాల ఉద్యమాలలో పాల్గొని ఆళ్వారుస్వామి పలుమార్లు జైలుకు వెళ్లాడు. అలా జైలు లోపల తన తోటి ఖైదీ గాధలను వస్తువుగా తీసుకొని “జైలు లోపల” అనే కథల/పుస్తకం రాశాడు. అందులో మొదటి కథ “పరిగె”. అది తన తోటి ఖైదీ మల్లయ్య వెనుక ఉన్న విషాద గాధ. పేదవాడిలో నైతిక విలువలు నిర్బంధంలోనూ రక్తసంబంధాలను తలచుకుంటూ తపించిపోయే ఖైదీల హృదయం, జైలుకు రావడం వెనకున్న యధార్ధాలను ఈ కథ మానవీయ కోణంలో చూపెడుతుంది. స్వామి రచించిన “ప్రజల మనిషి” నవల వారికి గొప్ప కీర్తిని తెచ్చి పెట్టింది.

ప్రశ్నలు:

1. ఆళ్వారు స్వామి స్థాపించిన సంస్థ ఏది ?

2. పరిగె కథలో ఉన్న విషాదం ఎవరిది ?

3. ఆళ్వారు స్వామి తల్లిదండ్రులు ఎవరు?

4. ఆళ్వారు స్వామి బెజవాడలో చేసిన ఉద్యోగం ఏమిటి?

5. తెలంగాణ వైతాళికుడు అని ఎవరిని పిలుస్తారు.

Share This Book