అపరిచిత గద్యాలు
28 అపరిచిత గద్యం-22
మన దేశ స్వాతంత్ర్య పోరాటంలోకి అడుగుపెట్టిన విప్లవకారులలో మొట్టమొదటి వారు చాపేకార్ సోదరులు. అది పద్దెనిమిది వందల తొంబై ఏడు పూనాలో జరిగింది. ఆనాడు పూనా పట్టణంలో ఎక్కడ చూసినా ప్లేగ్ వ్యాధి వ్యాపించి ఉంది. రాండ్ అనే వ్యక్తి ప్లేగు కమీషనర్ గా నియమించబడ్డాడు. అతడు క్రూరుడే గాక అతి నిరంకుశుడు కూడా. ప్లేగు వ్యాధి వ్యాపించిన గ్రామాలన్నీ విధిగా ఖాళీ చేయాలని అతడు ఆర్డర్ జారీ చేశాడు. అయితే ఆ ఆర్డర్ కు సంబంధించినంతవరకు అతని తప్పులేదు. కానీ దాన్ని అమలు జరిపిన తీరు వలన ఆయన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని కొని తెచ్చుకున్నాడు. అలాంటి గ్రామాల నుండి ప్రజలంతా అక్షరాల గెంటివేయబడ్డారు. తమ గుడ్డలను, పంట సామాగ్రి వగైరాలను సైతం సర్దుకుని తీసుకొని వెళ్లడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. లోకమాన్య తిలక్ 1897 మే 4 వ తేదీన తన పత్రిక కేసరిలో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో రాండ్ క్రూరుడు అని వర్ణించి నిర్బంధ విధానాన్ని అనుసరిస్తున్న ప్రభుత్వ ధోరణిని తప్పుపట్టాడు. అప్పుడే శివాజీ ఉత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆ సందర్బంగా 1897 జూన్ 12వ తేదీన జరిగిన ఒక బహిరంగ సభలో తిలక్ ప్రారంభ ఉపన్యాసం చేశాడు. ఆ ఉపన్యాసంలో తిలక్ మాట్లాడుతూ “దొంగలు మన ఇంటిలో ప్రవేశించినప్పుడు వారిని తరిమివేయడానికి మన వద్ద తగిన శక్తి లేనప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా వారిని ఇంటిలోనే ఉంచి ఇంటికి నిప్పంటించి సజీవ దహనం చేయడంలో తప్పులేదు ” అనే స్ఫూర్తిదాయకమైన మాటలు మాట్లాడాడు. జూన్ 22 వ తేదీన చాపేకార్ సోదరులు రాండ్ ను , ఎవరెస్ట్ ను చంపేశారు. చాపేకార్ సోదరులు చేసిన ఈ పనికి రాండ్ నిరంకుశత్వం తో పాటు, తిలక్ ప్రసంగం కూడా కారణం అనే విషయం ఆరోజు అందరూ అనుకున్నారు. ఈనాడు జరుపుకుంటున్న గణపతి ఉత్సవాలు కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా భారతీయులందరూ సమావేశం కావాలనే ఉద్దేశంతో తిలక్ ప్రారంభించినవే. గణపతి సామూహిక ఉత్సవాలను తిలక్ మొట్టమొదటగా పూనాలో ప్రారంభించాడు.
ప్రశ్నలు.
1. చాపే కార్ విప్లవ వీరులు ఏ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలోకి అడుగుపెట్టారు.
2. ప్లేగు వ్యాధి కమిషనర్ గా నియమించబడిన వ్యక్తి ఎవరు?
3. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నడిపిన పత్రిక పేరు ఏమిటి?
4. తిలక్ మాట్లాడిన బహిరంగ సభ ఏ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది.
5. జూన్ 22వ తేదీన జరిగిన సంఘటన ఏమిటి?