అపరిచిత గద్యాలు
24 అపరిచిత గద్యం-18
మానవుడు ఇతర ప్రాణుల కంటే గొప్పవాడు, భిన్నమైన వాడు కావడానికి బుద్ధి, ప్రజ్ఞ, భాష ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. మనసులో ఉన్న అభిప్రాయాలను ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడే అర్థవంతమైన ధ్వని రూపమే భాష. ప్రపంచంలో ఇప్పుడు దాదాపు 3500 భాషలు ఉన్నాయి. భాష మానవుడికి గొప్ప ఆయుధమే కాదు అది విలువ కట్టలేని సంపద. దీనిద్వారా అభిప్రాయ ప్రకటన చేసి అనుకున్న పనిని సాధించవచ్చు.దీని వలన కోపము , బాధ, ప్రేమ, వినయములను సులువుగా తెలుపవచ్చు. మాట స్నేహాన్నే కాకుండా శత్రుత్వమును కూడా కలిగించును. కావున ఆచితూచి మాట్లాడడం మంచిది. అందమైన కవితలు అల్లి తమ ప్రజ్ఞను భావితరాలకు పుస్తక రూపంలో అందించుటకు భాష సహకరించును.ప్రతి భాషలో ఒక సొగసు , ఒక ఒడుపు , ఒక గొప్పతనం ఇమిడి ఉంటుంది. పుట్టినప్పటి నుండి ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను తప్పక నేర్చుకోవాలి. సంస్కృతి , సంస్కారం ఇతర విలువలు నేర్చుకొని మనిషిగా ఎదగాలంటే మాతృభాష తప్పనిసరి అవసరం. విద్య , వైజ్ఞాన, సామాజిక అవసరాల కోసం తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలి.మాతృభాష చక్కగా నేర్చుకుంటే ఎన్ని భాషలైనా సులువుగా నేర్చుకోవచ్చు. కీర్తిశేషులు సునీత్ కుమార్ చటర్జీ, ఆచార్య వినోబాభావే ,పీవీ నరసింహారావు , సరస్వతీపుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు మొదలైన మహనీయులు మాతృభాష బాగా నేర్చుకున్న తర్వాతే అనేక భాషల్లో పండితులయ్యారు. అటువంటి వారే జాతికి మణిపూసలు.
ప్రశ్నలు:
1. మనిషి ఆచితూచి ఎందుకు మాట్లాడాలి.
2. ఇతర ప్రాణుల కంటే మనిషి ఎందుకు గొప్పవాడు.
3. మాతృభాషతో పాటు ఇతర భాషలు ఎందుకు నేర్చుకోవాలి.
4. మనిషిగా ఎదగడానికి కావలసినవి ఏవి?
5. సరస్వతీ పుత్రుడు ఎవరు?