అపరిచిత గద్యాలు

23 అపరిచిత గద్యం-17

మానవుడు జంతువులను మచ్చిక చేసుకోవడం నాగరికత మారుతున్న క్రమంలో ఒక ముందడుగు. మన ముందు తరాల్లో వన్యప్రాణులను కూడా మచ్చిక చేసుకునేవారు. అయితే నేడు ఈ స్థితిలో మార్పు వచ్చింది. ఏ జంతువును అంటే ఆ జంతువును మచ్చిక చేసుకోవడానికి వీలు లేదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం నిర్దేశించిన జంతువులనే పెంచుకోవాలి. క్షీరదాలు, ఒంటెలు, పిల్లులు, కుక్కలు, గాడిదలు, గుర్రాలు, పందులు, గొర్రెలు, మేకలు, తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. కరోనా, జీవిత గమనాన్ని పూర్తిగా మార్చింది. ఆ మహమ్మారి తెచ్చిన మార్పుల్లో పెంపుడు జంతువులని పెంచుకోవడం కూడా ఒకటి. లాక్ డౌన్ అనేది అందరి దృష్టి పెంపుడు జంతువుల పై పడేలా చేసింది. అందుకే కరోనా సమయంలో ఎప్పుడూ లేనంత డిమాండ్ పెట్స్ కి ఏర్పడింది. అదే క్రమంగా విదేశీ పెంపుడు జంతువులపై ఆసక్తి పెరిగేలా చేసింది. హైదరాబాదు, విశాఖపట్నం , విజయవాడ తదితర నగరాలలో కూడా “ఎగ్జోటిక్ పెట్స్” షాపులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల నుంచే పెట్స్ ప్రభుత్వ అనుమతితో రవాణా చేసుకునేవారు. దేశవ్యాప్తంగా ఎగ్జోటిక్ పెట్స్ కి డిమాండ్ పెరగడంతో అహ్మదాబాద్ , పూనే, ముంబై తదితర నగరాలలో బ్రీడింగ్ కేంద్రాలు వెలిశాయి. వీటిలో అనేక రకాల విదేశీ పక్షులు, జంతువులను పెంచుతున్నారు.మన దేశానికి చెందిన పక్షులను పెంచుకోవడం వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం నేరం. కానీ విదేశీ పక్షుల దిగుమతి, పెంపకం, వృద్ధికి ఈ చట్టం అనుమతిస్తుంది. పెట్స్ అనగానే చాలామందికి శునకాలే గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు పిల్లులను పెంపుడు జంతువులు గా పెంచుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నీటి తొట్టెల్లో వయ్యారంగా జలకాలాడే రంగురంగుల చేపల్ని పెంచడం కూడా ఇంటిల్లిపాదికి ఎంతో కాలక్షేపాన్ని కలిగిస్తుంది. ఫ్లాబెల్లా జాతి గుర్రాలు కూడా నేడు పెంపుడు జంతువులుగా ఇళ్లలో కనిపిస్తున్నాయి.

ప్రశ్నలు

1. ఏ చట్టానికి లోబడి మనం జంతువులను పెంచుకోవాలి.

2. మన దేశానికి చెందిన పక్షులను పెంచుకోవడం నేరం. దీనికి కారణమైన చట్టం ఏది?

3. ఇప్పుడు నగరాలలో దర్శనమిస్తున్న షాపులు ఏవి?

4. ఏ జాతి గుర్రాలు నేడు పెంపుడు జంతువులయ్యాయి.

5. ఇటీవల కాలంలో ఎవరి సంఖ్య బాగా పెరిగింది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

అపరిచిత గద్య కరదీపిక Copyright © 2024 by Venuvardhan Samudrala is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.

Share This Book