అపరిచిత గద్యాలు

19 అపరిచిత గద్యం-13

జీవితాన్ని తమ కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వాడిన మహనీయులు ఎందరో వున్నారు. అటువంటి వారిలో వనజీవి రామయ్య గా పేరు గడించిన దరిపల్లి రామయ్య ఒకరు. కోటికి పైగా మొక్కలను నాటి, పెంచడం వల్ల ఆయన వనజీవి రామయ్య గా పిలిపించుకున్నారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య ప్రతిభను గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ తొమ్మిదవ తరగతి తెలుగు విద్యార్థుల కోసం ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టిందంటే పర్యావరణాన్ని కాపాడడానికి రామయ్య చేసిన కృషిని గమనించవచ్చు. ఇతని స్వగ్రామం ముత్తుగూడెం. అక్కడే పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఉపాధ్యాయుడు మల్లేశం ప్రబోధించిన “మొక్కల పెంపకం- లాభాలు” అనే పాఠం అతనిలో స్ఫూర్తినింపింది. తన ఇంటిలోని నలభై కుంటల స్థలంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచాడు. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం , ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు రోజువారి పని అయింది. ఇతని వృత్తి కుండలు చేయడం, పాలు అమ్మడం. ప్రవృత్తి మాత్రం వన పెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేయడం. ఇతడు తన మనుమళ్లు, మనమరాళ్లకు కూడా చెట్ల పేరే పెట్టారంటే చెట్లను పెంచడం పట్ల అతనికున్న ఆరాటం అర్థం అవుతుంది. ఒక మనుమరాలి పేరు చందన పుష్ప. ఇంకో మనమరాలి పేరు హరిత లావణ్య. కబంధ పుష్ప అని ఇంకో పాపకు పేరు పెట్టాడు. మరో మనవరాలికి వనస్థలి అని నామకరణం చేశాడు. ఏ సందర్భంలోనైనా తను బహుమతి ఇవ్వదలుచుకున్నా, తనకు బహుమతి ఇవ్వాలనుకున్న మొక్కలని ఇవ్వాలంటాడు. కోటికి పైగా మొక్కలను నాటి ఇంకా మొక్కలు నాటడం లోనే నిమగ్నమై ఉన్న వనజీవి రామయ్య కృషిని గమనించి మన భారత ప్రభుత్వం అతనిని పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. ఈ పురస్కారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా రామయ్య అందుకున్నాడు. విద్యార్థినీ విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరూ ఇటువంటి మంచి కార్యక్రమాలలో భాగం పంచుకుంటే అంతకంటే మంచి మార్పు ఇంకేముంటుంది.

ప్రశ్నలు.

1. ఎవరికైనా బహుమతి ఇస్తే రామయ్య ఇచ్చేది.

2. వన జీవి రామయ్య పాఠాన్ని తెలుగు పుస్తకంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వం.

3. మల్లేశం మాష్టారు వల్ల రామయ్య స్ఫూర్తి పొందిన పాఠం ఏది

4. పద్మశ్రీ అందించిన రాష్ట్రపతి పేరు.

5. రామయ్య ఇంటి స్థలం ఎంత?

Share This Book