చిన్ని పొత్తమునకు ఎన్నెన్ని కానుకలో…
6 అభినందనలు – శ్రీమతి సుషుమ్న రావు తాడినాడ
అపరిచిత గద్య కరదీపిక అనే ఈ పుస్తక ప్రయతాన్ని అభినందిస్తూ ఓ చిన్నమాట.
పాఠ్యాంశాల్లో అపరిచిత గద్యాల ప్రాముఖ్యత గురించి పలు ఉపాధ్యాయ కరదీపికల్లో ఉంటాయేమో కానీ వీటిని ఎలా రాయాలి, విషయాలు ఇలా ఉండొచ్చు అనీ, వాటికి ఉదాహరణలు ఇస్తూ తెలుగులో వచ్చిన పుస్తకాలు తక్కువేనేమో! (అసలు ఉన్నాయా? ఉంటే ఓపెన్ రిసోర్స్ గా ఉన్నాయా అనేవి నాలో మెదలుతున్న ప్రశ్నలు)
ఈ పుస్తకంలో అపరిచిత గద్యాంశం ఎలా రాయాలి అనే విషయంపై దృష్టి పెట్టడమేకాకుండా, పలు ఆసక్తికర విషయాలపై గద్యాలను, వాటిపై ప్రశ్నలను రూపొందించి అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు సైతం ఉపయోగపడేలా రూపొందించిన ఈ పుస్తకాన్ని ఒక అమూల్యమైన విద్యావనరు అనిచెప్పడం అతిశయోక్తికాదేమో!
పలు జాతీయ, అంతర్జాతీయ, పర్యావరణ, సామాజిక విషయాలను స్పృశిస్తూ, సాగిన ఈ గద్య కరదీపిక చాలా పెద్ద విషయాలను సైతం, సరళంగా అర్థవంతంగా వివరిస్తూ చదువరులను ఆకట్టుకునేలా ఉంది.
ఇక ఈ ఆన్ లైన్ పుస్తక విషయానికి వస్తే…అపరిచిత గద్య కరదీపిక రూపొందిస్తున్నాని శ్రీ వేణువర్థన్ గారు నాతో చెప్పి, మీరు ఓపెన్ లైసెన్సింగ్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటూ ఉంటారు కదా, ఈసారి ఈ గద్యాంశాల్లో కొన్నిటిని విడుదలచేస్తానని చెప్పారు. ఎప్పుడో ఆరేళ్ళక్రితం నేను చెప్పిన మాట గుర్తుంచుకుని, తెలుగు భాషలో సార్వత్రిక విద్యావనరులు అందిస్తాన్నన్న శ్రీ వేణువర్థన్ గారికి మనఃపూర్వక అభినందనలు.
ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అంటే… ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్- తెలుగులో సార్వత్రిక విద్యావనరు అని ప్రస్తావిస్తుంటారు.విద్యార్థులకు, స్వీయ అభ్యాసకులకు, విద్యా వేత్తలకు వెరసి అందరికీ బోధన, అభ్యసన, పరిశోధనకు గాను ఉపయోగించు కోవడానికి, ఉచితంగా, ఓపెన్ లైసెన్స్ తో అందించబడేవి సార్వత్రిక విద్యా వనరులు అని చెప్పవచ్చు. ఇవి మన తెలుగు భాషలో చాలా తక్కువ. ఈ విషయాలపై అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహిస్తున్నపుడు స్థానిక భాషల్లో వీటి అవసరం చాలా ఉన్నదని చెప్పినప్పుడు, అప్పుడే ఈ విషయాన్ని గురించి తెలుసుకున్నవారూ, ఈ సార్వత్రిక విద్యా వనరులపై అప్పటికే అవగాహన ఉన్నవారుకూడా, సమయాభావం వల్లనో, ఇతరత్ర కారణాల వల్లనో రూపొందించలేకపోతున్నాం అని చెబుతూ ఉంటారు. “సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే” అనే విషయం శ్రీ వేణువర్థన్ గారు, ఈ సార్వత్రిక విద్యావనరుతో మరోసారి రూఢీ చేశారు కదూ! – శ్రీమతి సుషుమ్న రావు తాడినాడ – ఎడ్యుకేషనల్ టెక్నాలజిస్ట్, OER practitioner – Justwrite.in