అపరిచిత గద్యాలు
10 అపరిచిత గద్యం-4
స్వాభిమానం సభ్య లక్షణం, దురభిమానం ధూర్త లక్షణం, నిరభిమానం నిర్వీర్య లక్షణం. అప్పుడెప్పుడో డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్న మాటలు ఇవి. నా భాష, నా సంస్కృతి, నా కళలు, నా చారిత్రక వారసత్వం గొప్పది అనుకోవడం స్వాభిమానం. అది ఉత్తమ లక్షణం. మరి నావే గొప్పవి అనుకోవడం శృతిమించితే ఏర్పడేది దురభిమానం. అలా భావించేది చెడ్డవారు మాత్రమే. ఆ మనకెందుకులే! అంటూ ఆసక్తి లేకుండా ఉండడం, నీరసమైన మాటలు పలకడం ఏ అభిమానం లేని వాడి లక్షణం. అది చేతగానితనం మాత్రమే. ఆంగ్ల పాలన నుంచి మన దేశాన్ని విముక్తం చేయాలని మనం జరిపిన స్వాతంత్ర్య సంగ్రామం స్వాభిమాన సంకేతమే. ఆ తర్వాత పరిపాలన నుంచి మనం విముక్తులమయ్యామే గాని, ఆలోచనల్లో ఇంకా పరాధీనులు గానే ఉన్నాం. ఆంగ్లభాష ,ఆ పాశ్చాత్య సంస్కృతి మన మెదల్ల పొరలలో ఇంకా పేరుకొనే ఉన్నాయి. ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించే సత్యమైన మాట. తెలుగు భాష అత్యంత సంపన్నమైన భాష. ఇటీవల 2008 సంవత్సరాని కంటే ముందుగానే పాశ్చాత్య విజ్ఞాన వేత్త ప్రొఫెసర్ హాల్డెన్ ఏ సాంకేతిక వైజ్ఞానిక అర్ధాన్ని అయినా సమర్థంగా చెప్పే పద సంపద తెలుగు భాషకు ఉన్నదని గుర్తించి చెప్పారు. ఇద్దరు సగటు తెలుగువారు కలుసుకుంటే సంభాషణల్లో దొర్లేవి ఇంగ్లీష్ మాటలే. ఇలా అనడం ఇంగ్లీష్ కు నిరసన తెలపడం కాదు. మాతృభాష అవసరాన్ని గుర్తించడం. ఏ భాషా పదాన్ని అయినా తనలో జీర్ణించుకునే శక్తి తెలుగు భాషకు ఉంది ఇంగ్లీషు , హిందీ, ఉర్దూ పదాలనే కాదు అల్మారి, ఇస్త్రీ లాంటి పోర్చుగీసు పదాలను కూడా తెలుగు భాష తనలో కలుపుకుంది. దక్షిణాఫ్రికా స్వతంత్ర దేశంగా రూపొందిన తర్వాత ఆ దేశం మంత్రి మండలిలో “జులూ” అనే ఆటవిక తెగకు చెందిన ప్రతినిధులు ఉన్నారు. జులూ తెగకు భాష లేదు. యాస తప్ప. ఆ యాస భాషను, ఆటవిక సంస్కృతిని పరిరక్షించుకోవడానికి జులూ నాయకులు ఉద్యమాలు నడిపారు. అది స్వాభిమానం అంటే. ఒక యాస కోసం, అభివృద్ధి చెందని ఒక సంస్కృతి కోసం ఆ తెగవారు ప్రదర్శనలు జరిపారంటే ఆ సంఘటనల ద్వారా మన నాగరీకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
ప్రశ్నలు..
- ఏ సాంకేతిక అర్ధాన్ని అయినా చెప్పే పద సంపద తెలుగుకు ఉన్నదని అన్నది ఎవరు ?
అ) హాల్డెన్ ఆ) జులూ ప్రతినిధులు ఇ) సి. నారాయణరెడ్డి ఈ) ఎవరూ కాదు
- మనకెందుకులే! అనుకొని నీరసంగా మాట్లాడటం ఎవరి లక్షణం?
అ) జులూ లక్షణం ఆ) ధూర్త లక్షణం ఇ) అభిమానం లేనివాడి లక్షణం ఈ) దక్షిణాఫ్రికా లక్షణం
- ఆల్మారీ , ఇస్త్రీ మెదలైనవి ఏ భాషా పదాలు?
అ) తెలుగు ఆ) ఇంగ్లీష్ ఇ) పోర్చుగీసు ఈ) హిందీ
- “జులూ” తెగ ఏ దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏర్పడింది?
అ) భారత దేశం ఆ) ఫ్రాన్స్ ఇ) జర్మనీ ఈ) దక్షిణాఫ్రికా
- ఇద్దరు తెలుగు వారు కలుసుకుంటే మాటల్లో దొర్లేవి…
అ) పోర్చుగీసు పదాలు ఆ) ఇంగ్లీష్ పదాలు ఇ) జపనీస్ పదాలు ఈ) సంస్కృత పదాలు
Interactive Exercise-4