అపరిచిత గద్యాలు

7 అపరిచిత గద్యం-1

“తెలంగాణ”  గురించి ఉన్న మొట్టమొదటి శాసనం క్రీస్తు శకం 1417 వ సంవత్సరం లోనిది. దీనిని మెదక్ జిల్లా, రామచంద్రాపురం, తెల్లాపూర్ గ్రామంలో రాష్ట్ర పురావస్తు శాఖ శాసన పర్యవేక్షణ వారు కనుగొన్నారు. ఈ శాసనంలో “తెలంగాణ పురం” అనే పట్టణంలోని విశ్వకర్మలకు చెందిన కొండమీది మల్లోజు అనే వ్యక్తి మనుమలు ఒక దిగుడు బావిని తవ్వించారనీ, దానికి ఉత్తరాన మామిడి తోటను పెంచి ఏతాం ద్వారా నీటి సరఫరా చేశారనే వివరాలు ఉన్నాయి. 1510 వ సంవత్సరంలో వెలిచెర్ల శాసనం లో ప్రతాపరుద్ర గణపతి అనేక తెలంగాణ దుర్గాలను గెలిచినట్టు ఉన్నది. తమిళనాడులో ఉన్న తిరువన్నామలై శాసనంలో “దెలంగాణ్య” మని  శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ గురించి రాయించాడు. 15వ శతాబ్దపు చివరి భాగంలో వెన్నెలకంటి సూరన  కవి రాసిన విష్ణు పురాణం అవతారిక (పరిచయ పేజీల్లో ) లో తెలంగాణ ప్రస్తావన ఉన్నది. తెలంగాణ అన్నమాట  కనీసం 1400 సంవత్సరం నాటికి స్థిరపడి ఉన్నా , తెలంగాణ అన్న పేరు పడిన భూభాగాలకు చరిత్ర ఎప్పటినుంచో ఉన్నది. ఆదిరాజు వీరభద్రరావు” తెలంగాణ భూభాగపు అత్యంత ప్రాచీన కాలము నుండి తెలుగు వారికి స్థావరమై ఉంది.  శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు ఈ ప్రాంతంలో విజృంభించి ఎంతో గొప్పగా తమ పరిపాలన కొనసాగించారు. ఎన్నో గొప్ప విశేషాలతో ఈ హైదరాబాదు రాజ్యము పునీతమై ఉన్నది”. అని వారి మాటల్లో చెప్పడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రతిభ ఎంత కీర్తి గడించినదో చెప్పవచ్చు.

ప్రశ్నలు:  

1.తెలంగాణలో అనేక దుర్గాలను గెలిచిన రాజు ఎవరు?

అ) ప్రతాపరుద్ర గణపతి  ఆ) కృష్ణదేవరాయలు  ఇ) సూరన  ఈ) వీరభద్రరావు

2. విష్ణు పురాణం రాసిన కవి ఎవరు?

అ) వీరభద్రరావు  ఆ) సూరన ఇ) మల్లోజు  ఈ)  కృష్ణదేవరాయలు

3. తెలంగాణ గురించి తెలిపే మొట్టమొదటి శాసనం ఏ సంవత్సరం లోనిది.

అ) 1417  ఆ) 1510 ఇ) 1400 ఈ) పైవేవీ కావు

4. 1510 వ సంవత్సరంలో బహిర్గతమైన శాసనం పేరు.

అ) వెలిచర్ల శాసనం   ఆ) బెజవాడ శాసనం ఇ) అద్దంకి శాసనం ఈ) అమరావతి శాసనం

5.ఎన్నో గొప్ప విశేషాలతో హైదరాబాదు రాజ్యము పునీతమై ఉన్నది. అన్న మహనీయుడు ఎవరు?

అ) సూరన   ఆ) మల్లోజు  ఇ) కృష్ణదేవరాయలు ఈ) ఆదిరాజు వీరభద్రరావు

 

ఆంధ్రజ్యోతి ఎడిటర్  కె.శ్రీనివాస్  గారు రాసిన తెలంగాణ సాహిత్య వికాసం నుండి  సేకరణ


Interactive Exercise-1

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

అపరిచిత గద్య కరదీపిక Copyright © 2024 by Venuvardhan Samudrala is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.

Share This Book