అపరిచిత గద్యాలు
26 అపరిచిత గద్యం-20
సిరి ధాన్యాల ఆవశ్యకతను గురించి ప్రపంచానికి తెలిపి, ఆరోగ్యం విషయంలో ఆ ధాన్యాల అవసరం ఎంత ఉందో గత 20 ఏళ్లుగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఖాదర్ వలి. వీరు ఒక స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు. “మిల్లెట్ మ్యాన్” అనే పేరుతో అందరికీ తెలిసిన వారు. సామలు, అరికెలు, కొర్రలు, అండు కొర్రలు, ఊదలు ఈ ఐదు సిరి ధాన్యాలను వెలికి తీసి, వాటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలిపి, ఆహారంలో చేర్చి అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్న మహనీయులు ఖాదర్ వలి. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా, ప్రొద్దుటూరులో హుస్సేనమ్మ, హుస్సేనప్ప దంపతులకు జన్మించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో స్టెరాయిడ్స్ ను అంశంగా తీసుకొని పీ.హెచ్.డి. ని పూర్తి చేశారు. బెవెర్టన్ ఓరెగన్ లో పర్యావరణ శాస్త్రం పై పోస్టు డాక్టర్ ఫెలో గాను, సి.ఎఫ్.టి ఆర్. ఐ.లో శాస్త్రవేత్తగాను, మూడు సంవత్సరాలు పనిచేశారు. అమెరికాలోని “డ్యూపాండ్” అనే కంపెనీలో నాలుగున్నర సంవత్సరాలు పనిచేశాడు. మనం తినే తిండి కూడా విషతుల్యం అవుతుండడం గమనించి, ఆహారం కూడా వ్యాపారం కావద్దని, తాను పరాయి దేశంలో ఉద్యోగం చేయకుండా స్వదేశంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేస్తున్నారు. 1997లో భారతదేశానికి తిరిగి వచ్చి మైసూర్లో స్థిరపడ్డారు. అంతరించిపోతున్న పై ఐదు సిరి ధాన్యాలను వాడడం వల్ల భయంకరమైన జబ్బులు కూడా తగ్గుతాయని కనుగొన్నారు. అందుకే ఆ ఐదు ధాన్యాలకు “సిరి ధాన్యాలు” అని పేరు పెట్టారు. అంతేకాక పండించే రైతులకు అవి సిరులను అందించే ధాన్యాలని ఖాదర్ వలీ తెలిపారు. వ్యవసాయ శాస్త్రానికి చేసిన సేవలకు గాను 2023లో పద్మశ్రీ పురస్కారం లభించింది. భారత మాజీ రాష్ట్రపతి రామనాథ కోవిద్ ఈ పురస్కారాన్ని అందజేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సి.పి.ఐ) తమ 2024 వార్షిక పురస్కారాల ప్రధాన ఉత్సవం సందర్భంగా “బ్రిక్స్ సిపిఐ సుస్థిర వ్యవసాయ మార్గదర్శి జీవన సాఫల్య” పురస్కారాన్ని మాజీ రాష్ట్రపతి రామనాద్ కోవిద్ చేతుల మీదుగా వీరికి అందించారు. మనిషి ఏది సాధించాలన్న ఆరోగ్యం ప్రధానం. అటువంటి ఆరోగ్యాన్ని అందించే ఆహార పరిశోధనలు చేసి మానవాళికి మేలు చేస్తున్న ఖాదరవలి నిజంగా ప్రాతఃస్మరణీయులు.
ప్రశ్నలు:
1. ఖాదర్ వలి నాలుగున్నర సంవత్సరాలు పనిచేసిన కంపెనీ ఏది?
2. సి.పి.ఐ. అంటే ఏమిటి?
3. 2023 లో ఖాదర్ వలి కి పద్మశ్రీ రావడానికి కారణం ?
4. ఖాదర్ వలి ఏ పేరుతో అందరికీ పరిచయం ?
5. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎక్కడ ఉంది?