చిన్ని పొత్తమునకు ఎన్నెన్ని కానుకలో…
2 ప్ర హ్లా దం – Prof. Dr. PAMMI PAVAN KUMAR
తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచ సాహిత్యంతో పోటీపడగల కావ్యాలు, ప్రబంధాలు, పురాణ, ఇతిహాసాలున్నాయి. శాఖోపశాఖలుగా విస్తరిల్లిన విఙ్ఞాన గ్రంథాలున్నాయి. ప్రపంచసాహిత్యంలో ఏ ఇతర భాష, సాహిత్య రంగాలతో పోల్చుకొన్నా అబ్బురపరిచే ఘనమైన భాష, సాహిత్య వారసత్వసంపద మనకు ఉంది.
సాహిత్యాన్ని, విఙ్ఞానాన్ని మనం అనుభూతించడం, అనుభవిచడంతోపాటు, మన వారసత్వ సంపదగా తరువాతి తరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. బోధన-అభ్యసనాలు, కొత్త సాహిత్య సృష్టి, సాహిత్యరూపాల-శాఖల విస్తరణ, వివిధ అవసరాలకు తెలుగుభాషను వినియోగంలోకి తెచ్చుకొనే ప్రయత్నం… మొదలైన వాటిలో ఇప్పటికే అనుసరిస్తున్న పద్ధతులకు తోడుగా ఎలక్ట్రానిక్ (సంగణక) అనువర్తనలను జోడించడంద్వారా మనకు, మనతరాలకు కలిగే ఫలితాలు ఎక్కువ. విద్యారంగంలో వివిధ స్థాయిలలో ఎలక్ట్రానిక్ సమాచార నిధుల అవసరం అపారంగా ఉంటుంది. కాని, వినియోగించుకోదగిన రీతిలో లభ్యమవుతున్న ఆకరాల సంఖ్య తక్కువ. తెలుగుభాషలో లభ్యమవుతున్నవి మరీ తక్కువ.…
ఈ లోటును భర్తీ చేసేందుకు కృషిచేస్తున్న కొద్దిమందిలో శ్రీ సముద్రాల వేణువర్ధన్(తెలుగు శాఖాధిపతి, భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్, బి.హెచ్.ఇ.ఎల్., హైదరాబాదు) కాస్త చురుకైన వరుసలో నిలుస్తారు. అపరిచిత గద్య కరదీపిక అనే పేరుతో, అపరిచిత గద్యాంశాలను రూపొందించే ప్రక్రియలోని మెళకువలను ఓపెన్ లైసెన్స్ కలిగిన ఎలక్ట్రానిక్ పుస్తక రూపంలో ఆయన మనముందు ఆవిష్కరిస్తున్నారు. ఇటువంటి పాఠ్య, పఠనీయ గ్రంధాలకు స్థల, కాల అవధులను అధిగమించే వెసులుబాటువుంటుంది. దీర్ఘ కాలంపాటు సమాచారాన్ని నిలువ ఉంచుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా- పెంచుకోడం, కుదించడం, మార్పులు చేసుకోడం, పునర్నవీకరించడం, వివిధ అవసరార్థులకు పఠనీయ సమాచారాన్ని అందుబాటులో ఉంచడం… మొదలైన పనులన్నీ సులభంగా చేయవచ్చు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఉన్న సమాచారానికి ఉన్న అదనపు సౌకర్యమూ, ప్రయోజనమూ, ఆకర్షణా ఇది.
రాష్ట్ర, జాతీయ స్థాయిలలోని విద్యామండళ్ళు నిర్వహింపచేసే పరీక్షలలోనూ, వివిధ పోటీపరీక్షలలోనూ అపరిచిత గద్యాంశాలను ఇచ్చి, తరువాత అడిగిన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించమనడం ఉంది. గద్యపఠనంలో విద్యార్థుల అవగాహనను మూల్యాంకనం చేయడానికి పనికివచ్చే ప్రయోజనకరమైన పద్ధతి ఇది. “నా దృష్టిలో అపరిచిత గద్యాంశం అంటే దాని ప్రారంభవాక్యమే చదువరిని లాగి బుట్టలో వేసుకోవాలి. దీనికి విషయంలో ఆకర్షణతోపాటు, చదువరికి రసఙ్ఞత అవసరం. ఇన్విజిలేషన్ చేస్తున్న తెలుగు చెప్పని ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు సైతం ప్రశ్నపత్రం చేతిలోకి తీసుకుని పూర్తిగా చదివి తృప్తిగా నిట్టూర్చాలి. ఇచ్చిన ఉపాధ్యాయ మిత్రుడిని పలకరించాలి, ప్రశంసించాలి. అందులో ఉపాధ్యాయుడి వ్యక్తిత్వం బహిర్గతం కావాలి. మొత్తానికి గద్యాంశం ప్రశ్నపత్రానికి ప్రాణమై వెలగాలి. అంతేనా? విద్యార్థి ఇంటికి వెళ్ళేలోపు ఇంట్లో వారితో సహా ప్రశ్నపత్రం చూసిన ప్రతి ఒక్కరి నోళ్ళల్లో అది చిందులు వేయాలి. అదీ నిజంగా గొప్ప అపరిచిత అంశం అంటే. విద్యార్థి నైతిక, విఙ్ఞాన వికాసంలో వీటి పాత్ర చాలా గొప్పది కనుక వీటి విషయంలో శ్రద్ధ తప్పనిసరి” అంటున్నారు రచయిత ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో. ఇవన్నీ గద్యబోధన, అభ్యసనాలలో ఒక పార్శ్వాన్ని ప్రతిపాదిస్తున్న అంశాలు.
గద్యబోధన, అభ్యసనాలలో గుర్తుంచుకోవలసిన మరో పార్శ్వం ఉంది. చరిత్ర-సంస్కృతి, భాషలు, విఙ్ఞానశాస్త్రం, జీవిత/వ్యక్తి చరిత్ర, దేశ/ప్రాంత పరిచయం, జీవజాలం-జీవావరణం, జాతిగౌరవం… మొదలైన అంశాలకు సంబంధించిన విషయాలను ఈ గద్యలలో పరిచయం చేశారు. ఇవి సాహిత్య గద్యలు కావు; విషయ నివేదన గద్యలు. విషయ నివేదన గద్యకు భావ ప్రకటన ప్రధానం. విషయ పరిఙ్ఞానాన్ని పెంపొందింపజేయడం, భాషా ప్రయోగ/వినియోగ నైపుణ్యాభివృద్ధిని కలిగించడం, విషయ ప్రకటన-గ్రహణాలలో ప్రాధాన్యక్రమాన్ని గుర్తించడం, కేంద్రాభిప్రాయాన్ని పట్టుకోగలగడం, భాష వాడకంలో శైలీభేదాలను గుర్తించి సార్థకంగా వినియోగంలోకి తేగలిగే నైపుణ్యాన్ని వృద్ధిచేయడం… మొదలైనవి విషయ నివేదన గద్యను పరిచయంచేయడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.
ఒక్క ముక్కలో- సాహిత్యగద్య హృదయ సంబంధి; విషయ నివేదనగద్య బుద్ధిసంబంధి. ఈ రెంటిని అన్ని తరగతులలోనూ, స్థాయిలలోనూ సమతూకంగా నేర్పగలిగినపుడు తెలుగు భాష మరింత పరిపుష్టమవుతుంది. వ్యవహార రంగాలన్నిటికీ విస్తరించగలుగుతుంది. ఇది కొండంత లక్ష్యం; బహు కష్టసాధ్యమని ఊరుకోకుండా ఈ-గ్రంధ రచనతో లక్ష్యాన్ని చేరుకొనే పనిని ప్రారంభించిన రచయితను, ఈ మార్గంలో విశేషమైన కృషిచేసి, రచయితను ఈబాట పట్టించిన విదుషీమణి శ్రీమతి సుషుమ్నారావుగారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ గ్రంథంలోని ప్రతి గద్యకు చివరన బహుళైచ్చిక ప్రశ్నలున్నాయి. ఇంటరాక్టివ్ అభ్యాసాలున్నాయి. ఇవి విద్యార్థుల అభ్యసనంలో ఎంతో సహకరిస్తాయి. ఙ్ఞానార్జన స్థాయిని అంచనావేసుకోడంలో కీలకమైన ఇటువంటి స్వీయ పరీక్షాంశాలను మరిన్నిటిని ఈ-గ్రంథంలోని గద్యలకు జోడించే అవకాశం ఉంది. తెలుగు భాషకు, విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఉపయోగకరమైన ఇటువంటి ప్రయత్నాలను ప్రహ్లాదంతో ఆహ్వానిస్తున్నాను. వీరిరువురి వృద్ధిని, భాషాభివృద్ధిని నిండు మనసుతో కాంక్షిస్తున్నాను. – Prof. Dr. PAMMI PAVAN KUMAR – Professor of Telugu & Head, Centre for Endangered Languages and Mother Tongue Studies, School of Humanities, University of Hyderabad, Hyderabad – 500 046, TS., India. – Ph: office – 040-2313 3562, M: +91-98664 86934, e-mail: pavankpammi@uohyd.ac.in