స్వాగతం

ఉపాధ్యాయుల కై AI: ఒక ఓపెన్ టెక్స్ట్‌బుక్ (ఓపెన్ లైసెన్స్ కలిగిన పాఠ్య పుస్తకం). ఇది కోలిన్ డి లా హిగ్వేరా మరియు జోత్స్నా అయ్యర్ చే అంతర్జాతీయ క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ 4.0  లైసెన్స్ కలిగిన పుస్తకం. ఈ పుస్తకం ప్రస్తుతం ఇంగ్లీషులో  ఇక్కడ అందుబాటులో ఉంది.

పాఠశాల విద్యా విభాగాల్లో కృత్రిమ మేధ పాత్రను చర్చిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) పలు రూపురేఖల్లో పలు రకాలుగా అందుబాటులోకి వచ్చింది, వస్తోంది. ముఖ్యంగా (Machine Translation) యంత్రానువాదం సాధనాల వినియోగం విద్య, శిక్షణ రంగ్గాల్లో విప్లవాత్మక మార్పును తెస్తోంది. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని సులభంగా ఎన్నో భాషల్లోకి కేవలం కొన్ని నిముషాల్లో అనువాదం చేయగలిగే సామర్త్యాన్ని ఇప్పటికే సాధించింది. AI సాధనాల నిరంతర అభివృద్ధితో, పలు రంగాల్లో, వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని సమర్థవంతంగా, శీఘ్రంగా అందరికీ అందుబాటులో ఉంచేలా చేస్తోంది.

యంత్రానువాదం సాధనాలు భాషా అవరోధాలను తొలగించడమే కాక అనువాద ప్రక్రియను వేగవంతం చేస్తాయి, అయితే, మానవ పరిశీలన, నియంత్రణ అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఏదైనా అనువాదం చేసేటప్పుడు ఆయా ప్రదేశాల సంస్కృతి, నుడికారం, సందర్భంలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యం. ఈ విషయాలను, అంశాలను సరిగ్గా గుర్తించడంలో కృత్రిమ మేధ ఇంకా పూర్తిగా సమర్థవంతంగా లేదనే చెప్పాలి.

ఈ పుస్తకంలో మేము ఉపయోగించిన అనువాద సాధనాలు చాట్ జిపిటి గూగుల్ ట్రాన్స్ లేట్, భారత ప్రభుత్వం అందించిన ఏఐ ఆధారిత యాప్ ‘అనువాదిని’ .

ఇలా ఈ పుస్తకాన్ని పలు AI సాధనాల యంత్రానువాదం సహాయంతో అనువదించి, ఆ అనువాదానికి అవసరమైన చోట సవరణలతో సరిదిద్దుతూ తెలుగులోకి (వ్యవహారిక భాషలో అవసరమైన చోట లిప్యంతరీకరణతో) తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ మూడు సాధనాల పనితీరును కుడా ఈ పుస్తకంలో అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సాధనాల ద్వారా మాకు వచ్చిన అవుట్ పుట్ ను కూడా మీకు అందించే ప్రయత్నంలో ఉన్నాము.

ఈ పుస్తకం ద్వారా మానవ మేధస్సు, కృత్రిమ మేధ మధ్య సమన్వయాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము.

ఈ బృహత్తరకార్యక్రమాన్ని చేపడదాం అని అనుకున్నపుడు శ్రీ కిషోర్ మెండెం గారు తమవంతు సహాయాన్ని అందిస్తామని ముందుకు వచ్చారు.

ఈ సంవత్సరం 2024 ఓపెన్ ఎడ్యుకెషన్ వీక్ లో భాగంగా , మొదటి రెండు అధ్యాయాలను అందించే ప్రయత్నం చేస్తున్నాం!

త్వరలో మరింతమంది నిపుణుల సహాయంతో పూర్తి పుస్తకాన్ని ఏప్రిల్ 2024 చివరినాటికి అందుబాటులోకి తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నాం!